కలికిరి నేస్తం న్యూస్..పూణె: మహారాష్ట్రలోని పుణెలో భారీ స్థాయిలో డ్రగ్స్‌ (Drugs) బయటపడటం తీవ్ర కలకలం రేపింది. రూ.1,100 కోట్ల విలువ చేసే 600 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్‌ చేసినట్లు పోలీసులు వెల్లడించారు..

ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలను పూణె నగర పోలీస్‌ కమిషనర్‌ అమితేష్‌ కుమార్‌ వెల్లడించారు. ”ఆదివారం ముగ్గురు వ్యక్తుల్ని అరెస్టు చేశాం. వారి నుంచి రూ.3.85 కోట్లు విలువైన 1.75 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్‌ చేశాం. దర్యాప్తులో భాగంగా రెండు గోదాముల్లో 55 కిలోల మెఫెడ్రోన్‌ను గుర్తించాం. అనంతరం జరిగిన దర్యాప్తులో సేకరించిన సమాచారం ఆధారంగా ఆపరేషన్‌ చేపట్టి కుర్కుంభ్‌ ఎంఐడీసీ ప్రాంతంలో 550 కిలోల మెఫెడ్రోన్‌ను సీజ్‌ చేశాం. ఇప్పటివరకు మొత్తంగా 600 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నాం. ఈ డ్రగ్స్‌ విలువ దాదాపు రూ.1,100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసు బృందాలు ఇతర ఏజెన్సీలతో కలిసి సమన్వయం చేసుకొని పని చేస్తున్నాయి” అని వివరించారు..

ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల గురించి ప్రశ్నించగా.. వారు ప్రాథమికంగా కొరియర్‌ బాయ్స్‌గా పని చేస్తున్నారని, కొన్ని నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు కమిషనర్‌ వెల్లడించారు. ఈ కేసు ప్రాథమిక దశలో ఉన్నందున తదుపరి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ వ్యవహారంతో లలిత్‌ పాటిల్‌కు ఏమైనా సంబంధం ఉందా? అని అడగ్గా.. ఇప్పటివరకు అలాంటి కోణం ఏదీ వెలుగులోకి రాలేదన్నారు. గతేడాది నాసిక్‌లోని మాదక ద్రవ్యాల తయారీ కేంద్రంపై ముంబయి పోలీసులు రెండు నెలల పాటు ఆపరేషన్‌ చేపట్టి రూ.300 కోట్ల విలువైన మెఫెడ్రోన్‌ను సీజ్‌ చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న వ్యక్తే లలిత్‌ పాటిల్‌. పూణె ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తప్పించుకొని పారిపోగా ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు..

Trending

Design a site like this with WordPress.com
Get started